Connect with us

FAST NEWS

ఈ రోజు న్యూస్ బాక్స్…అన్ని వార్తలు ఒకే చోట…(17-01-2019)

Published

on

 1. బిఎస్‌పి అధినేత్రి మాయావతి మంగళవారం తన 63 జన్మదిన వేడుకలను జరుపుకున్న నేపథ్యంలో ఆమె రాజకీయ వారసుడికి సంబంధించిన ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. అధినేత్రి పుట్టినరోజు వేడుకలకు పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు హాజరైనప్పటికీ మాయావతి వెంటనే ఉన్న ఒక యువకుడు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాడు. మాయావతి రాజకీయ వారసుడు ఇతడేనేమో అనే గుసగుసలు కూడా అక్కడ వినిపించడం విశేషం. నీలం రంగు సూటు వేసుకుని బిఎస్‌పి అధినేత్రి వెన్నంటే ఉన్న ఆ యువకుడు మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్ కుమారుడు ఆకాశ్ కుమార్ అని తెలిసింది. పార్టీ వర్గాల కథనం ప్రకారం వచ్చే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తన రాజకీయ వారసుడిగా ఆకాశ్ కుమార్‌ను రంగంలోకి దించి పార్టీ యువజన విభాగ సారథ్య బాధ్యతలను అతనికి అప్పగించాలని మాయావతి యోచిస్తున్నారు. అయితే, దీనిపై ఎటువంటి కచ్ఛితమైన సమాచారం మాత్రం అధికారికంగా వెల్లడించ లేదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత అకాశ్ నుంచి మాయావతి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారని, సోషల్ మీడియా వ్యూహాలను అతనే రచిస్తున్నాడని, ప్రస్తుతం బిఎస్‌పి సోషల్ మీడియాను నడిపిస్తున్న ఆకాశ్ మాత్రం ఎన్నడూ తెర ముందుకు రాలేదని వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆనంద్ కుమార్‌ను బిఎస్‌పి జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రకటించాలని భావిస్తున్న మాయావతి లండన్‌లో ఉన్నత చదువులు చదివి ఇండియాకు తిరిగి వచ్చిన ఆకాశ్‌ను తన రాజకీయ వారసుడిగా ఆమె ప్రకటించే రోజులు ఎంతో దూరం లేవని వినపిస్తోంది. కాగా, బిఎస్‌పి అధినేత్రికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఒక విషయంలో పోలిక ఉందనే చెప్పాలి. మమత కూడా తన రాజకీయ వారసుడిగా తన సోదరుడి కుమారుడు అభిషేక్ బెనర్జీని తెరమీదకు తెస్తున్నారు.
 2. రజనీకాంత్‌ ‘పేట’ సినిమాతో ఇటీవల మంచి హిట్‌ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో నటించనున్నట్లు తెలి సింది. ఈ ప్రాజెక్టు గురించి కొన్ని రోజుల క్రితం మురుగదాస్‌ మాట్లాడుతూ.. రజనీకి కథ చెప్పానని, ఆయన నుంచి ఫోన్‌కాల్‌ కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. ఫాంటసీ చిత్రంగా దీన్ని తెరకెక్కించబోతున్నట్లు కూడా చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు.
 3. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కేంద్రంలో గాలిపటం ఎగురవేస్తూ బాలుడు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. సదాశివనగర్ గ్రామానికి చెందిన పోలబోయిన లక్ష్మణ్ కుమారుడు పోలబోయిన దర్మపురి అనే బాలుడు మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గాలిపటం ఎగురవేస్తూ వాహనాలను గమనించకుండా 44వ జాతీయ రహదారి దాటుతుండగా టిఎస్ 08 ఈఎ 1590 నంబర్ గల షిఫ్ట్ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాన్సువాడ వద్ద హాస్టల్‌లో 7వ తరగతి చదువుతున్న బాలుడు సంక్రాంతి సెలవుల్లో ఇంటికి వచ్చి ప్రమాదంలో మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ జె. నరేష్ తెలిపారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
 4. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక మహిళ తల్లిదండ్రులకు రూ.20.86 లక్షల నష్టపరిహారం చెల్లించాలని మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్స్ ట్రిబ్యూనల్(ఎంఎసిటి) బుధవారం ఆదేశించింది. మరణించిన అను అనే 34 ఏళ్ల మహిళ అవివాహితని, ఆమె వివాహం చేసుకుని ఉంటే ఆమె తల్లిదండ్రులకు నష్టపరిహారం తగ్గి ఉండేదన్న ఇన్సూరెన్స్ కంపెనీ వాదనతో విభేదించిన ఎంఎసిటి కుమారులే కాదు, కుమార్తెలు కూడా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటారు అని స్పష్టం చేసింది. 2015లో యాక్టివా స్కూటర్‌పై అను తన ఆఫీసుకు వెళుతుండగా వేగంగా వచ్చిన ఒక కారు ఆమెను ఢీకొంది. ఈ ప్రమాదంలో అను అక్కడికక్కడే మరణించింది. కారు యజమాని హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాకు చెందిన హుసన్ చంద్ వేగంగా, నిర్లక్ష్యంగా కారు నడిపి అను మరణానికి కారకుడయ్యాడని, అతను, ఇన్సూరెన్స్ కంపెనీ మృతురాలి తల్లిదండ్రులు ధరమ్‌పాల్ మాగో(60), మధు మాగో(58)లకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని ట్రిబ్యూనల్ తీర్పు చెప్పింది. రెండు నెలల్లో 7.5 శాతం వడ్డీ వేసి రూ.20.86 లక్షలు చెల్లించాలని, ఆలోపల చెల్లించకపోతే 9 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని ట్రిబ్యూనల్ ఆదేశించింది. ఈ కేసు తీర్పు సందర్భంగా ట్రిబ్యూనల్ ఇంకా ఇలా చెప్పింది..వయసు మీరిన తల్లిదండ్రులను కేవలం వారి కుమారులే చూసుకుంటారన్నది ఒకప్పటి భావన. కాని ఈ రోజుల్లో కుమార్తెలు శారీరక, మానసిక స్థయిర్యాన్ని ఇవ్వడమే కాదు తమ తల్లిదండ్రుల ఆలనాపాలనా చూసుకుంటూ వారికి ఆర్థికంగా కూడా సాయపడుతున్నారు అని మొహాలీ జిల్లా సెషన్స్ న్యాయమూర్తి వివేక్ పురీ పేర్కొన్నారు.
 5. మండల కేంద్రంలోని నార్నే ఎస్టేట్స్‌లో గుర్తు తెలియని మృత ధేహం లభ్యమైన ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిని వివరాల ప్రకారం… బిబినగర్ శివారులోని నార్నే ఎస్టేట్స్‌లో సగం కాలిన వ్యక్తి మృత ధేహన్ని మేకలు కాపరులు చూసి పోలీసులకు సమాచరం ఇచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృత ధేహన్ని పరిశిలించిన వారం రోజుల క్రితమే ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకొచ్చి మృత ధేహన్ని గుర్తు పట్టకుండ ఉండేందుకు కాల్చేసి ఉండోచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృత ధేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. గత వారం రోజులుగా తమకు వచ్చిన కేసులో తప్పిపోయిన నమోదు వారి జాబితాను సేకరించి వాటి ఆధారంగా మృతుడి వివరాలు సేకరించేందుకు ప్రయత్నం చేస్తున్నమన్నారు. సంఘటన స్థలాన్ని రాచకొండ కమిషనరేట్ భువనగిరి జోన్ డిసిపి రాంచంద్రారెడ్డి, ఎసిపి జితేంధర్ రెడ్డి, సిఐ సురేంధర్ రెడ్డి, పరిశిలించారు. రాచకొండ కమిషనరేట్ నుండి వచ్చిన ప్రత్యేక ఫోరెన్సిక్ టీం మృత ధేహ వివరాలను సేకరిస్తున్నట్టు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.
 6. రణవీర్‌ సింగ్‌, దీపికా పదుకొనే చాలా కాలం పాటు ప్రేమ ఉన్నాక వివాహం చేసుకున్నారు. సుమారుగా నాలుగైదేళ్లు ఈ ప్రేమ వ్యవహారం నడిచింది. ఈ సమయంలో అంటే పెళ్లికి ముందు చాలా అనుభవాలు ఎదురయ్యాయి.
 7. తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ ఎంఎల్ఎ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌, మాజీ స్పీకర్ మదుసూదనాచారి, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ను గవర్నర్ నరసింహన్, సిఎం కెసిఆర్ లతో పాటు మాజీ స్పీకర్ పుష్పాగుచ్చాలతో అభినందనలు తెలిపారు. రేపటి(గురువారం) నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే.
 8. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి పార్వేటి ఉత్సవము మకరసంక్రమునకు మరుసటిరోజున అనగా కనుమ పండుగనాడైన జనవరి 16వ తేదీ బుధ‌వారం తిరుమలలో అత్యంత ఘనంగా జరిగింది. అదేరోజున దాపరిణయోత్సవం కూడా కన్నుల పండుగగా జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్‌ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. ఈ మాలలను శ్రీవారి మూల మూర్తికి అందంగా అలంకరించారు. బుధ‌వారం స్వామివారికి ప్రాతఃకాలారాధన పూర్తి అయిన తరువాత శ్రీమలయప్పస్వామివారు తిరుచ్చిలో వేంచేసారు. వారి వెంటనే మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణస్వామి వేంచేసారు. అనంతరం పార్వేట మండపమునకు వెళ్ళి, ఆ మండపమునందు పుణ్యాహము జరిగిన పిమ్మట మంచెలో వేంచేసారు. శ్రీస్వామివారికి ఆరాధనము, నివేదనము జరిగి హారతులు జరిగాయి. అనంత‌రం ఉభయదార్లకు తాళ్ళపాక వారికి, మఠంవారికి మర్యాదలు, స్వామివారు మండపమును వదలి ప్రాంగణమునకు వచ్చారు. శ్రీకృష్టస్వామివారిని మాత్రము సన్నిధి గొల్లపూజ చేసిన చోటుకు వేంచేపుచేసి పాలువెన్న ఆరగింపు అయి హారతి జరిగిన పిమ్మట శ్రీమలయప్పస్వామివారి సన్నిధికి వెళ్ళారు. తరువాత ఆ గొల్ల సమర్పించిన పాలు వెన్న శ్రీమలయప్పస్వామివారికి నివేదనము హారతి అయి గొల్లకు బహుమానము జరిగింది. తరువాత శ్రీమలయప్పస్వామివారు ముందునకు కొంత దూరము పరుగెత్తి వారి తరపున అర్చకులు బాణమువేసిన పిమ్మట వెనుకకు వచ్చారు. ఇట్లు మూడుసార్లు జరిగింది. స్వామివారి వేటను తిలకించడానికి పారువేట మండపానికి వేలాదిగా భక్తులు విచ్చేసారు. శ్రీమలయప్పస్వామివారు ఉత్సవము పూర్తియి మహాద్వారమునకు వచ్చి హత్తీరాంజీవారి బెత్తమును తీసుకొని సన్నిధిలోనికి వేంచేసారు. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పారువేట ఉత్సవము ఘనంగా ముగిసింది. ఈ ఉత్సవంలో ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి హ‌రీంద్ర‌నాధ్‌, షేష్క‌ర్ ర‌మేష్‌బాబు, బోక్కసంసెల్‌ ఇన్‌చార్జ్‌ గురురాజస్వామి, ఫార్‌ఫ‌తేదార్ శ‌శిధ‌ర్‌, ఇతర ఉన్నతాధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 9. మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన జాదవ్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కనక్ సర్కార్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని వైస్ చాన్సలర్ సురంజన్ దాస్ బుధవారం ప్రకటించారు. అంతర్జాతీయ పౌర సంబంధాల విభాగానికి ప్రొఫెసర్ అయిన సర్కార్ ఆదివారం తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో మహిళల కన్యత్వాన్ని సీల్డ్ బాటిల్‌గా లేదా ఒక చింపని ప్యాకెట్‌గా అభివర్ణించడం తీవ్ర దుమారాన్ని రేపింది. సర్కార్ వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించినప్పటికీ దాని స్క్రీన్‌షాట్లు మాత్రం వైరల్ అయ్యాయి. ఆయనో(సర్కార్) టీచర్. ఆయన వ్యాఖ్యలు యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చాయి. నిబంధనల ప్రకారం ఆయనపై చర్య తీసుకుంటాము అని విసి దాస్ అన్నారు. గతంలో క్లాస్ రూములో కూడా సర్కార్ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు తన దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. సర్కార్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్, పశ్చిమ బెంగాల్ మహిళా కమిషన్ తమంతట తాముగా విచారణ చేపట్టనున్నట్లు తనకు తెలిసిందని ఆయన చెప్పారు. యూనివర్సిటీకి చెందిన విద్యార్థి సంఘాలు కూడా సర్కార్ వ్యాఖ్యలపై నిరసన తెలిపి విసికి వినతిపత్రం అందచేశాయి. అసలు సర్కార్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఏం రాశారంటే… సీలు విరిగిపోయిన కూల్ డ్రింక్ సీసానో లేక బిస్కెట్ల ప్యాకెట్‌నో మీరు కొనడానికి సిద్ధపడతారా? మీ భార్య విషయంలో కూడా అదే వర్తిస్తుంది. ఒక ఆడపిల్ల కూడా జీవశాస్త్రం ప్రకారం జన్మించినప్పటి నుంచి సీల్డ్ బాటిల్ లాంటిది..కన్య అంటే విలువలు, సంస్కృతి, లైంగిక ఆరోగ్యం వంటి చాలా విషయాల సమ్మిళితం. చాలా మంది అబ్బాయిలకు కన్యత్వం గల భార్య ఒక దేవత వంటిది అంటూ సర్కార్ వ్యాఖ్యలు చేశారు. కాగా, తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలను సర్కార్ బుధవారం కూడా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తన స్నేహితులకు చెందిన ఒక సోషల్ మీడియా గ్రూపులో వినోదం పంచుకునేందుకే తాను ఈ పోస్ట్ పెట్టానని ఆయన చెబుతున్నారు. తాను ఎవరి మనోభావాలను కించపరిచేందుకో ఏ మహిళను అవమానించేందుకో ఈ వ్యాఖ్యలు చేయలేదని అతను చెప్పారు. పైగా, ఎవరి వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించుకునే హక్కు వారికి ఉంటుందని సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పిందంటూ సర్కార్ ఉటంకిస్తున్నారు.
 10. కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించడంతో మరింత మంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అలా తాము ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని భావిస్తున్నారు.
 11. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం వీర్లపల్లిలోని పరిశ్రమ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. మహా శివ శక్తి స్టీల్ ఇండస్ట్రీలో మంటలు రావడంతో ఉద్యోగులు అగ్నిమాపక సిబ్బంది సమాచారమిచ్చారు. నాలుగు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.
 12. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి నియామక కమిటీ ఈ నెల 24న సమావేశమై సిబిఐ నూతన డైరెక్టర్‌ను నియమించనున్నట్లు తెలిసింది. ఈ నియామక కమిటీలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్ సభ్యులుగా ఉంటారు.
 13. కుక్క పిల్లలను అత్యంత కిరాతకంగా కొట్టి చంపిన ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులను పోలీసులు అరెస్టు చేశారు. కోల్‌కతాలోని నీల్ రతన్ సర్కార్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌లోని మొదటి సంవత్సరం నర్సింగ్ చదువుతున్న మోతుషి మోండల్, ద్వితీయ సంవత్సరం చదువుతున్న షోమా బర్మన్ అనే ఇద్దరు విద్యార్థినులపై ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఇద్దరు విద్యార్థినులు కుక్క పిల్లలను చంపుతున్న దృశ్యాన్ని ఎదురుగా ఉన్న డాక్టర్ ఆర్ అహ్మద్ దంత కళాశాల, ఆస్పత్రికి చెందిన కొందరు విద్యార్థులు వీడియో తీసి ఆన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్‌ఆర్‌ఎస్ కళాశాల సమీపంలోని చెత్త కుండీవద్ద 16 కుక్క పిల్లల కళేబరాలు నింపిన బస్తాలు ఆదివారం లభించాయి. దీంతోపాటు బాగా గాయపడి ఒక మరో సంచిలో కట్టిపడేసిన మరో కుక్క కూడా లభించింది. ఈ దారుణ సంఘటనపై దర్యాప్తు చేసేందుకు ఎన్‌ఆర్‌ఎస్ కళాశాల ఒక ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఆ ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులు తామే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు అంగీకరించారని పోలీసుల అధికారి ఒకరు చెప్పారు. తాము కాలేజీకి వెళ్లకుండా కుక్క పిల్లలు అడ్డంపడుతున్నాయని, అందుకే వాటిని తాము చంపివేశామని ఆ ఇద్దరు విద్యార్థినులు చెప్పినట్లు ఆయన తెలిపారు. కాగా, ఈ సంఘటనపై వివిధ జంతు సంరక్షణ సంస్థలు నిరసన తెలిపాయి. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను శిక్షించాలని పోలీసు స్టేషన్ ముందు ధర్నా జరిపాయి.
 14. సిబిఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరరావు నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వచ్చే వారం విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమిస్తూ జనవరి 10న కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సోమవారం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైనంది. అలోక్ వర్మను సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఉన్నత స్థాయి కమిటీ కొత్త డైరెక్టర్ నియామకం జరిగేవరకు సిబిఐ అదనపు డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వరరావుకు తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పటిస్తూ ఆదేశాలు జారీచేసింది. కామన్ కాజ్ అనే ఎన్‌జిఓతోపాటు ఆర్‌టిఐ కార్యకర్త అంజలీ భరద్వాజ్ ఈ నియామకాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ డైరెక్టర్ నియామకంలో పారదర్శకతను తీసుకురావడానికి నిర్ధిష్టమైన విధానాలను రూపొందించాలని ఈ పిటిషన్‌లో వారు కోరారు.
 15. విశ్వ హిందూ పరిషద్ మాజీ అధ్యక్షుడు విష్ణు హరి దాల్మియా బుధవారం ఇక్కడి తన నివాసంలో బుధవారం ఉదయం కన్నుమూశారు. 91 సంవత్సరాల దాల్మియా రామ జన్మభూమి ఉద్యమ సారథులలో ఒకరు. ప్రముఖ పారిశ్రామికవేత కూడా అయిన దాల్మియా అంత్యక్రియలు బుధవారం సాయంత్రం నిగమ్‌బోధ్ ఘాట్‌లో జరుగుతాయని విహెచ్‌పి ఒక ప్రకటనలో తెలిపింది. విష్ణు హరి దాల్మియా శ్రీరామ జన్మభూమి న్యాస్ ట్రస్టీయే కాక విహెచ్‌పికి చెందిన కేంద్రీయ మార్గదర్శక్ మండల్ సభ్యులు కూడా. రామజన్మభూమి ఉద్యమంలో ఆయన విహెచ్‌పి నాయకులు అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిషోర్‌తోకలసి చురుకైన పాత్ర పోషించారు.
 16. అంతరిక్ష కేంద్రాలలో గతంలో మొక్కలను పెంచారు. కానీ, చంద్రుని మీద విత్తనాలు మొలకెత్తడం ఇదే తొలిసారి. ఈ జీవ సంబంధ పరిణామం విస్తృత పరిశోధలనకు ఆస్కారమిచ్చింది.
 17. తమకు కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని కోరుతూ మహారాష్ట్రలోని బ్రాహ్మణులు ఈ నెల 22న ముంబయిలోని ఆజాద్ మైదానంలో మహా ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. మరాఠాలకు కల్పించిన తరహాలోనే తమకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండు చేస్తున్నారు. అగ్రవర్ణాలలోని పేదలకు పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన 10 శాతం రిజర్వేషన్లు చట్టపరమైన అవరోధాల కారణంగా అమలు అయ్యే అవకాశం లేదని సమస్త్ బ్రాహ్మణ్ సమాజ్ కన్వీనర్ విశ్వజీత్ దేశ్‌పాండే తెలిపారు. అందు వల్ల మాకు కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. మహారాష్ట్రలోని బ్రాహ్మణులు చాలా వెనుకబడ్డారని, ఆలయ పూజారులుగా వారికి తగిన ఆదాయం లేదని ఆయన చెప్పారు. దైవిక విధులలో ఉండే పూజారులకు నెలకు రూ 5,000 పెన్షన్ ఇవ్వడంతోపాటు ప్రత్యేక బ్రాహ్మణ ఆర్థిక అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. బ్రాహ్మణ విద్యార్థుల కోసం ప్రతి జిల్లాలో హాస్టళ్లు నిర్మించాలని, పిజి స్థాయి వరకు ఉచిత విద్యను అందచేయాలని కూడా ఆయన డిమాండు చేశారు. మరాఠాల ఉద్యమ ఫలితంగా గత డిసెంబర్‌లో వారికి మహారాష్ట్ర ప్రభుత్వం 16 శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. దీంతో మహారాష్ట్రలో మొత్తం రిజర్వేషన్ల సంఖ్య 68 శాతానికి పెరిగింది.
 18. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన పంజాబ్ ఎమ్మెల్యే బల్దేవ్ సింగ్ ఆప్ అధినేత, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. బల్దేవ్ సింగ్ మాట్లాడుతూ… కేజ్రీని నియంత, నిరంకుశుడు, అహంభావి అని దుమ్మెత్తిపోశారు. పార్టీ సిద్హాంతాలు, భావజాలం నుంచి ముఖ్యమంత్రి పూర్తిగా పక్కకు వెళ్లిపోయారన్నారు. కాగా, బల్దేవ్ సింగ్ మరో పంజాబ్ ఎమ్మెల్యే సుఖ్ పాల్ సింగ్ ఖైరాకు సన్నిహితుడు. ఖైరా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి గత నెలలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్ ఎమ్మెల్యేలను విశ్వాసంలోకి తీసుకోకుండా సుఖ్ పాల్ సింగ్ ఖైరాను అప్రజాస్వామికంగా ప్రతిపక్ష నాయకుడి పదవి నుంచి తొలగించారని బల్దేవ్ సింగ్ పేర్కొన్నారు.
 19. తెలంగాణలో టిఆఎర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. టిఆర్ఎస్ పార్టీ తరుఫున గవర్నర్ కోటాలో రాములు నాయక్, ఎంఎల్ఎ కోటాలో యాదవ రెడ్డి, స్థానిక సంస్థల కోటాలో భూపతి రెడ్డి అధికార పార్టీ ఎంఎల్సీలుగా ఎన్నికయ్యారు. వీళ్లు పార్టీ ఫిరాయింపులకు పాల్పడడంతో మండలి చైర్మన్ స్వామిగౌడ్ వీరిని అనర్హులుగా ప్రకటించింది. ఫిర్యాదుతో పాటు ముగ్గురు ఎంఎల్సీలకు సంబంధించిన ఆధారాలను అధికార పార్టీ ఎంఎల్సీలు సమర్పించడంతో వారిపై అనర్హత వేటు వేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన కొండా మురళి రాజీనామాను ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
 20. పెళ్లి చేసుకుంటానని నమ్మించి దాదాపు 16 మంది వితంతువులను, విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్న మహిళలను శారీరకంగా లోబరుచుకోవడమేగాక వారి నుంచి డబ్బులు కూడా వసూలు చేసిన ఒక మోసగాడిని కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. డిఎం రామకృష్ణ అనే 46 ఏళ్ల ఈ మోసగాడు మైసూరు జిల్లాలోని టి నరసిపూర్ తాలూకా దొడ్డములగోడు గ్రామానికి చెందిన వాడు. ఎస్‌ఎస్‌ఎల్‌సి పాసైన ఇతగాడు కొంత కాలం వ్యవసాయం చేశాడు. ఆ తర్వాత శివమొగ్గలోని ఒక కాలేజీలో క్లర్కుగా పనిచేశాడు. ఆ తర్వాత భార్యాపిల్లలతో మైసూరుకు మకాం మార్చి మోసాలు చేయడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో జైలుకు వెళ్లాడు. విలాసవంత జీవితం గడపాలన్న కాంక్షతో అతను పెళ్లయి విడాకులు తీసుకున్న మహిళలను, వితంతువులను పావుగా వాడుకోవడం ప్రారంభించాడు. తనకు పెళ్లి కాలేదని, వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు ఎవరైనా తనను సంప్రదించవచ్చని పత్రికలలో ప్రకటనలు ఇచ్చేవాడు. బెంగళూరు, చిక్కమగళూరు, హుబ్బలి-ధార్వాడ్, మైసూరుకు చెందిన మహిళలు దాదాపు 16 మంది మహిళలు అతని చేతిలో మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. తాను ప్రభుత్వ ఆరోగ్య శాఖకు చెందిన ఉద్యోగ నియామకాల విభాగంలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్నానని, తాను ఉద్యోగాలు ఇప్పించగలనంటూ కోరమంగళకు చెందిన ఒక మహిళను రామకృష్ణ ప్రలోభ పెట్టి ఆమె వద్ద నుంచి రూ. 3.9 లక్షలు వసూలు చేయడమే గాక ఆమెకు చెందిన వ్యక్తుల నుంచి రూ.22 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందడంతో అతని అసలు గుట్టు బయటపడింది. తన భార్య చనిపోయిందని చెప్పి ఒక మహిళకు పెళ్లి ఆశ చూపడమే గాక ఆమెను ఒక హోటల్ గదిలోకి రప్పించి ఆమెకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు కూడా రామకృష్ణపైన మరో కేసు నమోదైంది. కర్నాటక వ్యాప్తంగా రామకృష్ణపైన ఏఏ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయో పరిశీలిస్తున్నామని, అతని చేతిలో ఎంతమంది మోసపోయారో, ఎంత డబ్బు పోగొట్టుకున్నారో కచ్ఛితమైన వివరాలు ఇంకా రావలసి ఉందని పోలీసులు చెబుతున్నారు.
 21. తమిళనాడులోని వేలూరులో ఓ మహిళ ఎటిఎంలో నకిలీ నోట్లు జమ చేసిన ఘటన వెలుగు చూసింది. బాగాయం ఏరియాలోని భారతీయ స్టేట్ బ్యాంక్ కు చెందిన ఎటిఎంలో ఈ నెల 8వ తేదీన ఓ మహిళ ఫేక్ రూ. 30వేలు నోట్లు జమ చేసింది. అనంతరం నగదు నింపేందుకు వచ్చిన సిబ్బంది నకిలీ నోట్లను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళ బ్యాంకు అకౌంట్ నెంబరు, ఫోన్ నెంబర్, ఆమె పేరు ఆధారంగా ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, కొన్నిసార్లు ఎటింఎల నుంచి నకిలీ నోట్లు వస్తుండడం కామన్.. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది.
 22. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకు ఇక్కడి ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్(ఎహెచ్‌ఐ)లో గుండె బైపాస్ సర్జరీ జరిగింది. బ్రహ్మానందం ఆరోగ్య పరిస్థితి ఆదివారం క్షీణించడంతో ఆయనను ఇక్కడి ఎహెచ్‌ఐకు తరలించారు. వివిధ ఆరోగ్య పరీక్షల అనంతరం ఆయనకు ప్రముఖ హార్ట్ సర్జన్ రమాకాంత పాండ సోమవారం ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయనను అబ్జర్వేషన్‌లో ఉంచారని ఆయన కుటుంబ వర్గాలు తెలిపాయి. బ్రహ్మానందం కుమారులు రాజా గౌతమ్, సిద్ధార్థ ఆస్పత్రిలోనే తమ తండ్రి వెంట ఉన్నారు. 62 సంవత్సరాల బ్రహ్మానందం వెయ్యికిపైగా చిత్రాలలో నటించారు.
 23. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తోన్న సిన్మా ‘సైరా నరసింహారెడ్డి’. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి, రాజా పాండి అనే పాత్రలో కనిపించనున్నారు. బుధవారం సేతుపతి పుట్టినరోజును పురస్కరించుకొని సైరా సిన్మాలో విజయ్ సేతుపతి లుక్ ని తాజాగా రిలీజ్ చేసింది. ఆయన ధరించిన కాస్ట్యూమ్స్, కత్తి పట్టిన తీరు సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే, నయనతార.. నరసింహారెడ్డి భార్య సిద్దమ్మ పాత్రలో కనిపించనుంది. అమితాబ్ బచ్చన్.. నరసింహారెడ్డి గురువు పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ లో విడుదల చేయాలని చిత్రయూనిట్ భావించింది. కానీ ఇప్పుడు సైరాను దసరాకి వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
 24. ప్రేమపేరుతో యువకుడు వంచించడంతో మోసపోయానని మనస్థాపానికి గురై ఓ విద్యార్థిని విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం(రామప్ప) మండలం పాలంపేట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… స్థానికంగా నివాసముండే బోడ సింధుజా ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన రమేష్‌ అనే యువకుడిని ప్రేమించింది. కొంతకాలం వీరి ప్రేమాయణం బాగానే సాగింది. ఆ తరువాత రమేష్ యువతిని దూరం పెట్టాడు. ప్రేమ పేరుతో సింధుజాను మోసం చేశాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన సింధుజా ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు విగతజీవిగా పడిఉన్న కూతుర్ని చూసి బోరున విలపించారు. ఆ దృశ్యాలు అక్కడి వారిని కలిచివేశాయి. తమ కూతుర్ని మోసం చేసిన రమేష్‌ను శిక్షించాలంటూ మృతదేహంతో అతడి ఇంటి ముందు బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు పాలంపేట గ్రామానికి చేరుకొని బాధితులను సముదాయించే ప్రయత్నం చేశారు. కాగా, రమేష్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
 25. ఎపిలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రిటర్న్ గిఫ్ట్ పాలిటిక్స్ ఎపి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎపిలో ప్రతిపక్ష నాయకుడు జగన్‌తో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ సమావేశం కావడంపై ఇరు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. ఎపి సిఎం చంద్రబాబును టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతున్న టిఆర్ఎస్ పార్టీ … వైసిపితో భేటీతో వెనుక మతలబ్ ఏంటి.? అసలు ఈ భేటీలో ఏం చర్చకు రానుంది..? జగన్, కెటిఆర్ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. బుధవారం మధ్యాహ్నం 12-30 గంటలకు కెటిఆర్ బృందం లోటస్‌పాండ్‌లో జగన్‌ నివాసంలో సమావేశం కానుంది.
 26. తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో అదికార గులాబీ పార్టీని ఓడించేందుకు రాజ‌కీయంగా చాలా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. మ‌హాకూట‌మిగా ఏర్ప‌డ్డ నాలుగు పార్టీలు టీఆర్ఎస్ పై పైచేయి సాధించేందుకు అనేక ప్ర‌ణాళిక‌లు ర‌చించాయి.కాగా తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అదికార గులాబీ పార్టీ విజ‌యం సాదించ‌డంతో ప్ర‌తిప‌క్ష పార్టీలు ఖంగుతిన్నాయి.
 27. మకర సంక్రాంతి నాడు ప్రారంభమైన అర్ధ కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్ పేరు మార్పు) లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కుంభమేళాకు సర్వం సిద్ధం చేసింది యూపీ సర్కార్. ప్రపంచవ్యాప్తంగా తరలివచ్చే భక్తులకు, యాత్రీకులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తిచేసింది.
 28. తెలంగాణ‌లో పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్సీల‌పై తెలంగాణ స‌ర్కార్ కొర‌డా ఝుళిపించింది. ముంద‌స్తు ఎన్నిక‌ల ముందు పార్టీ మారిన ఎమ్మెల్సీల పైన ప్ర‌భుత్వం వేటు వేసింది. కొండా ముర‌ళి ముంద‌స్తుగానే ఎమ్మెల్సీ అభ్య‌ర్థిత్వానికి రాజీనామా చేయ‌గా మిగిలిన ముగ్గురిని అన‌ర్హులుగా ప్ర‌క‌టిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
 29. ఇతర వెనకబడిన తరగతులకు ఇచ్చిన రిజర్వేషన్ కోటాను యూపీ సర్కార్ విభజించే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇలా చేయడం వల్ల ఇతర వర్గాల వారిని కూడా ప్రసన్నం చేసుకోవచ్చని యోగీ సర్కార్ భావిస్తోంది. యోగీ సర్కార్‌లో మంత్రిగా ఉన్న ఓం ప్రకాష్ రాజ్‌భర్ కూడా రిజర్వేషన్లపై బాహాటంగానే మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. రిజర్వేషన్ కోటాను విభజించాలని చెబుతూ వస్తున్నారు రాజ్‌భర్.
 30. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త్వ‌రలో ఏపికి రానున్నారు. ఏపిలోనే వైసిపి అధినేత‌..విప‌క్ష నేత జ‌గ‌న్ తో ప్రత్యేకంగా స‌మావేశం కానున్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు మ‌ద్ద‌తు పై ఆ స‌మావేశంలో చ‌ర్చించ‌టం తో పాటుగా ఏపి రాజ‌కీయాల పైనా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇదే స‌మ‌యంలో ఏపికి ప్ర‌త్యేక హోదా విష‌యంలో టిఆర్‌య‌స్ వైఖ‌రి మార్పు లేద‌ని టిఆర్‌య‌స్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్ర‌క‌టించారు.
 31. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలోని 10 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో పోటీ కోసం ప్రధాన అభ్యర్థులు కోట్ల రూపాయలు సిద్ధం చేసుకుంటున్నారు.
 32. లోటస్ పాండ్ లో త‌ల‌పెట్టిన కీల‌క మీటింగ్ ముగిసింది. వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల భేటీ అనంత‌రం వారిద్ద‌రూ మీడియా ముందుకు వ‌చ్చారు. మొద‌ట కేటీఆర్ మాట్లాడగా, అనంత‌రం జ‌గ‌న్ మీడియాతో మాట్లాడారు.
 33. ఇతర వెనకబడిన తరగతులకు ఇచ్చిన రిజర్వేషన్ కోటాను యూపీ సర్కార్ విభజించే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇలా చేయడం వల్ల ఇతర వర్గాల వారిని కూడా ప్రసన్నం చేసుకోవచ్చని యోగీ సర్కార్ భావిస్తోంది. యోగీ సర్కార్‌లో మంత్రిగా ఉన్న ఓం ప్రకాష్ రాజ్‌భర్ కూడా రిజర్వేషన్లపై బాహాటంగానే మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. రిజర్వేషన్ కోటాను విభజించాలని చెబుతూ వస్తున్నారు రాజ్‌భర్.
 34. మహారాష్ట్రలో మరో సామాజిక వర్గం తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ రోడెక్కింది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించిన నేపథ్యంలో బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా తమకు రిజర్వేషన్ కల్పిచాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే జనవరి 22న సమస్త్ బ్రాహ్మిణ్ సమాజ్…ఆజాద్ మైదాన్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అక్కడ తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతామని చెప్పారు.
 35. ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. 49 రోజుల పాటు జరగనున్న ఈ మహాక్రతువుకు సంబంధించి యూపీ అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు.
 36. తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణం చేయించారు. సీనియర్ ఎమ్మెల్యేకు ప్రొటెం స్పీకర్ పదవి దక్కుతుండటం ఆనవాయితీగా వస్తోంది.
 37. ఏపిలో మూడు ప్ర‌ధాన పార్టీల‌దీ మూడు దార్లుగా క‌నిపిస్తోంది. టిడిపి అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికే బిజెపీత‌ర కాంగ్రెస్ మ‌ద్ద‌తు కూట‌మి లో ఉన్నారు. తాజాగా, కేసీఆర్ ప్ర‌తిపాదిత ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లోకి జ‌గ‌న్ ను ఆహ్వానించారు. అదే ఫ్రంట్ లోకి ప‌వ‌న్ కు ఆహ్వానం వ‌స్తుందా లేదా అనుమాన‌మే. వ‌చ్చినా ప‌వ‌న్ అందులో చేరుతారా.
 38. సెల్ ఫోన్ పట్టుకుని హాయిగా నవ్వుతూ కనిపిస్తున్న ఈ శిల్పం దెయ్యాలను గొప్పగా, ఎక్కువ చేసి చూపిస్తున్నట్లుందని, ఇది క్యాథలిక్కులకు అభ్యంతరకరమని ఆరోపిస్తున్నారు.
 39. ఆనందపురంలో బుధవారం ఉదయం ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఐటిబిపి 56వ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న కుమారి (23) అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. అదే బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న రాజేంద్రను మూడేళ్ల క్రితం కుమారి ప్రేమ వివాహం చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే కుమారి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం కుమారి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
 40. కారు టైరు పేలి ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి సమీపంలోని కోమరబండ వద్ద బుధవారం చోటుచేసుకుంది. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌ వైపు నలుగురు వ్యక్తులతో వస్తున్న కారు కూడలి సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైంది. కారు పలుమార్లు ఫల్టీలు కొట్టడంతో ముగ్గురు ఘటనాస్థలిలోనే చనిపోగా తీవ్రంగా గాయపడిన బాలుడిని హుటాహుటిన కోదాడలోని సర్కార్ దవాఖానకు తరలించారు. మృతులు ఎవరు, ఎక్కడి వారు అన్న వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
 41. కెన్యా దేశం నైరోబిలోని దుశిత్ డి2 కంపౌండ్ వద్ద తీవ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 15 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో అమెరికాకు చెందిన ఒక వ్యక్తి ఉన్నాడని స్థానిక పోలీసులు వెల్లడించారు. ఆల్ ఖైదాకు చెందిన సబ్ గ్రూప్ సోమాలి అల్ షాబాబ్ అనే స్థానిక ఉగ్రవాద సంస్థ ఈ దాడికి తామే పాల్పడ్డామని ప్రకటించింది. ఇద్దరు, ముగ్గురు తీవ్రవాదులు అప్ మార్కెట్ హోటల్ సంబంధించిన భవనం నుంచి కాల్పులు జరుపుతున్నారు. తీవ్రవాదుల కాల్పులకు ధీటుగా కెన్యా భద్రతా బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. తీవ్రవాదులు వద్ద ఎంతమంది ఉన్నారో తెలియడం లేదన్నారు. భవనం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని చెప్పారు. 2013 వ సంవత్సరంలో నైరోబిలోని వెస్ట్‌గేట్ మాల్ వద్ద అల్ షాబాబ్ అనే టెర్రరిస్టులు జరిపిన దాడిలో 67 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
 42. వైఎస్ఆర్ సిపి అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌తో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టిఆర్‌ఎస్ తరుఫున ఎంపీలు వినోద్ కుమార్, సంతోష్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, వైసిపి నుంచి వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్థసారథి, చెవిరెడ్డి హాజరయ్యారు. దేశంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కాకుండా ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ దిశగా సిఎం కెసిఆర్ ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు కెటిఆర్ జగన్‌తో సమావేశమై చర్చలు జరుపుతున్నారు.
 43. పెప్సికో మాజీ సిఇఒ ఇంద్రా నూయి ప్రపంచ బ్యాంక్ చీఫ్ రేసులో ఉన్నట్లు సమాచారం. నూయి అమెరికా ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ కోసం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత కూడా ఆయనతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్నారు. వ్యాపార పోకడలపై అపార అనుభవం ఉన్న నూయిని వరల్డ్ బ్యాంకు అధ్యక్ష పదవికి ట్రంప్ ప్రతిపాదించే అవకాశం ఉంది. ఈ బ్యాంకులో అధిక వాటా అగ్రరాజ్యానిదే. దీంతో అమెరికా చెప్పిన వారే సారథి అవుతారు. ఈ ప‌ద‌వి కోసం అమెరికా నుంచి కొన్ని పేర్లు ప్ర‌తిపాద‌న‌కు వెళ్ల‌నున్నాయని, దాంట్లో ఇంద్రా పేరు ఉన్న‌ట్లు తెలుస్తోంది. వైట్‌హౌజ్ కూడా నూయికే మొగ్గు చూపిన‌ట్లు సమాచారం. ప్రపంచ బ్యాంకు అధ్య‌క్షుడు జిమ్ యాంగ్ కిమ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
 44. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డితో తాను భేటీ అయ్యానని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. బుధవారం జగన్ తో కెటిఆర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ఏడాది కాలంగా సిఎం కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. జాతీయ స్థాయిలో సమాఖ్య స్ఫూర్తి, బిజెపి, కాంగ్రెసేతర పార్టీలతో కలిసి మరో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనపై మాట్లాడేందుకు జగన్ మోహన్ రెడ్డి వద్దకు వచ్చానని కెటిఆర్ స్పష్టం చేశారు.
 45. ”ఒరు ఆదార్ లవ్” అనే మలయాళ చిత్రంలోని పాటలో కన్ను గీటుతూ కుర్రకారు గుండెల్లో అలజడి సృష్టించిన ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఆమె నటిస్తున్న తాజా చిత్రం శ్రీదేవి బంగళా ట్రైలర్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశాంత్ మంబుల్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అభ్యంతరం తెలియచేస్తూ దివంగత సినీ నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ ఇప్పటికే లీగల్ నోటీసు పంపించినట్లు వార్తలు రాగా ఇటీవలే విడుదలైన చిత్రం ట్రైలర్ శ్రీదేవి మరణం వెనుక ఏదో కుట్ర ఉందన్న సంకేతాన్ని ఇవ్వడం కూడా వివాదాస్పదమవుతోంది. ప్రియా వారియర్ ఒక పాపకు ఆటోగ్రాఫ్ ఇచ్చే దృశ్యంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. మీకిష్టమైన నటి ఎవరని ఆ పాప అడిగితే తానేనని ప్రియ చెబుతుంది. ఒక వెడ్డింగ్ పార్టీలో ప్రియ మద్యం తాగడం, స్విమ్మింగ్, జాగింగ్, స్మోక్ చేయడం వంటి దృశ్యాలు కూడా ఇందులో ఉన్నాయి. బాత్‌రూమ్ టబ్‌లో ఆమె పడిపోయిన దృశ్యం, నేపథ్యంలో ఆమె వేసే కేకతోపాటు సైరన్ శబ్దం రావడంతో ట్రైలర్ ముగుస్తుంది. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయ్‌లోని ఒక హోటల్ రూమ్‌లో బాత్‌టబ్‌లో మునిగిపోయి మరణించిన విషయం తెలిసిందే. శ్రీదేవి మరణంపై మొదట్లో చాలా వదంతులు వినవచ్చినప్పటికీ అక్కడి పోలీసులు దాన్ని ప్రమాదంగా ప్రకటించారు. అయితే, ఈ ట్రైలర్‌లో ప్రియ స్విమ్మింగ్ చేయడం, తరువాత బాత్‌రూమ్ టబ్‌లో మరణించినట్లు చూపడాన్ని బట్టి చూస్తే శ్రీదేవి మరణం వెనుక ఏదో కుట్ర ఉందని చెప్పే ఉద్దేశం కనపడుతోంది.
 46. ఫెడరల్ ఫ్రంట్‌ పై కెటిఆర్‌తో చర్చించామని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం లోటస్ పాండ్ లో జగన్ తో కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తనతో ఫోన్ లో మాట్లాడారని జగన్ పేర్కొన్నారు. కేంద్ర పట్టించుకోకుండా రాష్ట్రాలకు అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదా విషయంలో తాము ఎంత పోరాడినా కేంద్రంలో కదలిక లేదని మండిపడ్డారు. ఎపికి చెందిన 25 ఎంపిలకు తోడుగా తెలంగాణ ఎంపిలు కలిసి వస్తే కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతుందని స్పష్టం చేశారు. హోదా సాధనకు ఎంపిల సంఖ్య ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాల ప్రయోజనం కోసం సిఎం కెసిఆర్ చేస్తున్న ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఇప్పుడు జరిగినవి ప్రాథమిక చర్చలు మాత్రమేనని, త్వరలో కెసిఆర్ కూడా తనని కలుస్తామన్నారని, ఫెడరల్ ఫ్రంట్‌పై మరింతగా చర్చిస్తామని జగన్ వివరించారు. కెటిఆర్‌తో చర్చించిన అంశాలపై పార్టీలో విస్తృతంగా చర్చిస్తామన్నారు.
 47. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ వ్యాఖ్యతగా ప్రసారమయ్యే ‘కాఫీ విత్ కరణ్’ షోలో మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడి టీమిండియా యువ ఆటగాళ్లు హార్ధిక్ పాండ్య, కెఎల్ రాహుల్ వివాదంలో ఇరుక్కున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్ధాంతరంగా ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. కాగా, దీనిపై పాండ్య తండ్రి హిమాన్షు స్పందించారు. తన కొడుకు ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలన్నా కూడా భయపడిపోతున్నాడని చెప్పారు. ఆస్ట్రేలియాతో జరగుతున్న వన్డే సిరీస్ కు దూరం కావడం పట్ల పాండ్య బాగా అప్‌సెట్ అయ్యాడని హిమాన్షు పేర్కొన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన… పాండ్య ఇంటికి వచ్చినప్పటి నుంచి బయటకు వెళ్లింది లేదు. కనీసం ఎవరైనా ఫోన్‌ చేసినా కూడా లిఫ్ట్‌ చేయడంలేదని చెప్పుకొచ్చారు. సంక్రాంతి పండగ రోజు కూడా పాండ్య ఇంట్లో డల్ గానే కూర్చున్నాడని, పంతంగులు ఎగరవేయడమంటే చాలా ఇష్టం ఉన్నా కానీ, ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా కైట్స్ ఎగురవేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టివి షోలో చేసిన కామెంట్స్ కి చాలా బాధపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి తప్పు మళ్లీ చేయడని హిమాన్షు తన కొడుకు తరఫున హామీ ఇచ్చారు.
 48. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిల భేటీ పైన ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బుధవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. ఏపీకి చెందిన ఆస్తుల పంపకాల్లో కేసీఆర్ అడ్డుపడుతున్నారన్నారు. అలాంటి వారితో జగన్ కలడవం విడ్డూరమన్నారు.
 49. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ చర్చానీయాంశంగా మారింది. అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం.. ఇటు లోక్ సభ ఎలక్షన్ల పర్వం వెరసి వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో టీడీపీ జతకట్టడం టీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి.
 50. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
 51. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి వస్తే తమకే లాభమని తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం అన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో వైసీపీ అధినేత జగన్ భేటీ అయిన విషయం తెలిసిందే.
 52. హీరో విశాల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త విజయ్ రెడ్డి కుమార్తె అనీశాతో ఆయన వివాహం జరగనున్నట్లు విశాల్‌ తండ్రి, ప్రముఖ నిర్మాత జీకె రెడ్డి వెల్లడించారు. తాజాగా ఈ విషయంపై విశాల్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ”అవును నేను పెండ్లి చేసుకోబోతున్న. చాలా సంతోషంగా ఉన్నా. అమ్మాయి పేరు అనీషా. త్వరలోనే వివాహ తేదీలను తెలియజేస్తాను” అని పేర్కొన్నాడు. కాగా, అనీశా పలు తెలుగు చిత్రాల్లో నటించింది కూడా. యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన ‘పెళ్లిచూపులు’, ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంలోనూ అనీశా నటించారు.
 53. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్‌స్టేషన్ సమీపంలో గల వాగులో బుధవారం సాయంత్రం ప్రమాదావశాత్తు టైరు పగిలి కారు వాగులో పడింది. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పడంతో కారులో ఉన్న వ్యక్తులు ఊపిరి పీల్చుకున్నారు. కారు నడుపుతున్న డ్రైవర్‌కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడం విశేషం. లక్షెట్టిపేట వైపు నుంచి జన్నారం వైపు వెళ్తోంది. వాగు బ్రిడ్జిపైకి రాగానే కారు టైరు పగలడంతో ఒక్కసారిగా అదుపుతప్పి బ్రడ్జి పక్కకు పల్టీలు కొట్టింది. పెద్దశబ్దం రావడంతో రహదారిపై వెళ్తున్న వాహనదారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని బోల్తా పడిన కారులోంచి డ్రైవర్ సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన డ్రైవర్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 54. ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి కదులుతున్న ట్రాక్టర్ నుంచి పడి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకొంది. బోనకల్ ఎస్సై పి రఘు తెలిపిన వివరాల ప్రకారం .బ్రాహ్మణపల్లికి చెందిన యువకులు కొందరు సంక్రాంతి పండుగ సందర్బంగా ఆటలపోటీలు నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. దాంట్లో భాగంగా బల్లలు, కుర్చీలు తీసుకొచ్చేందుకు గొల్లపూడి ట్రాక్టర్‌పై కొందరు బయలుదేరారు. ఈ సందర్బంగా ట్రాక్టర్ బోనకల్ క్రాస్ రోడ్డు సమీపంలోకి వచ్చిన సందర్భంలో మలుపు వద్ద వేగంగా వెళ్తున్న ట్రాక్టర్‌పై నుంచి బండి నరసింహారావు (35) అదుపుతప్పి కిందపడిపోయారు. ఆయన తలపై ట్రాక్టర్ చక్రం ఎక్కటంతో నరసింహరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంక్రాంతి పండుగ రోజు అంతా ఆనందంగా ఉన్న సమయంలో నరసింహారావు మృతి చెందటంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోగా గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
 55. స్థానిక సంస్థల కోటాలో స్వతంత్య్ర అభ్యర్ధిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని, అలాంటప్పుడు తనపై అనర్హత వేటు ఎలా వేస్తారని నిజామాబాద్‌కు చెందిన భూపతిరెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూపతిరెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్సీగా తాను టిఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎన్నిక కాలేదన్నారు. తనకు ఇచ్చిన నోటీసులు కూడా తప్పుల తడకగా ఉందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పక్షం టిఆర్‌ఎస్‌లో విలీనమైనట్లు కొద్ది రోజుల క్రితం స్వయంగా శాసనమండలి బులిటెన్ విడుదల చేసిన విషయాన్ని ఈ సందర్భంగా భూపతిరెడ్డి గుర్తు చేశారు. అలాంటిప్పుడు మండలిలో కాంగ్రెస్ పక్షం లేనప్పుడు…ఆ పార్టీలో తాను ఎలా చేరినట్లు అవుతుందని ఆయన ప్రశ్నించారు. తనపై ఏ విధంగా అనర్హత వేటు వేస్తుందో టిఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ప్రివిలేజ్ కమిటీ అడిగితే తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. సిఎంవో ఆఫీసు డైరెక్షన్‌లోనే నిర్ణయాలు: రాములు నాయక్ కెసిఆర్‌ను గాంధీతో పోల్చినందుకు తనకు ఆయన రిటన్ గిఫ్టుగా అనర్హత వేటు వేశారని రాములు నాయక్ బుధవారం వ్యాఖ్యానించారు. ఇందుకు కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సిఎంవో ఆఫీసు డైరెక్షన్‌లోనే మండలి చైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయాలు తీసుకుంటున్నారని రాములు నాయక్ ఆరోపించారు. గవర్నర్ కోటాలో తాను ఎమ్మెల్సీ అయ్యానని ఆయన అన్నారు. కెసిఆర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో తనపై అనర్హత వేటు వేశారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలించమని కెసిఆర్‌కు ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే ఆయన ప్రతిపక్ష నాయకులను నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నారని రాములు నాయక్ మండిపడ్డారు. గిరిజనుల హక్కుల గురించి మాట్లాడినందుకే తనపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ కారులను టిఆర్‌ఎస్ పార్టీలో లేకుండా చేస్తున్నారని రాములునాయక్ అన్నారు. ఉద్యమ కాలంలో కెసిఆర్ చెప్పిన మాటల్లో ఏ ఒక్కటి కూడా అమలుకాలేదన్నారు. టిఆర్‌ఎస్‌లోకి చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యీలపై ఎందుకు అనర్హత వేటు వేయలేదని ఆయన ప్రశ్నించారు. న్యాయం అందరికి ఒకేలా ఉండాలని ఆయన హితవు చెప్పారు. చట్టాన్ని అవహేళన చేశారు: యాదవరెడ్డి మాపై అనర్హత వేటు వేసి చట్టాలను అవహేళన చేశారని యాదవరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పక్షమే టిఆర్‌ఎస్‌లో విలీనం అయినప్పడు తమపై ఎలా చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. టిఆర్‌ఎస్‌లో ఉంటే ఒక న్యాయం, ప్రతిపక్షాలకు మరో న్యాయమా అని ఆయన నిలదీశారు. ప్రతిపక్షాలకు చెందిన ఎంతో మంది ప్రజాప్రతినిధులను టిఆర్‌ఎస్‌లోకి చేర్చుకున్నప్పుడు గుర్తుకురాని అనర్హత చట్టం ఇప్పుడే వెలుగులోకి వచ్చిందా అని యాదవరెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశంపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
 56. జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి. ప్రకాష్‌కు ‘పర్యావరణ సంరక్షక్’ అవార్డు లభించింది. వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ సారధ్యంలోని తరుణ్ భారత్ సంగ్ ఈ అవార్డుకు ప్రకాష్‌ను ఎంపిక చేసింది. అయితే ఇది ముఖ్యమంత్రి కెసిఆర్, వి.ప్రకాష్ జలవనరుల రంగంలో చేస్తున్న విశేష కృషికి దేశవ్యాప్త గుర్తింపుగా భావించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహాత్మాగాంధీ మనవడు అరుణ్ గాంధీ, ముని మనమడు తుషార్ గాంధీ చేతుల మీదుగా జనవరి 15, 16వ తేదీల్లో రాజస్థాన్ బీకంపురాలో జరిగిన కార్యక్రమంలో వి.ప్రకాష్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రాజేంద్రసింగ్ వి.ప్రకాష్ దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి ప్రముఖ పర్యావరణ వేత్తలు, జలవనరుల సంరక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సామాజిక కార్యకర్తలు, పలువురు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు హాజరయ్యారు. తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను తన ప్రసంగంలో వి.ప్రకాష్ ప్రస్తావించారు. గతంలో తన జన్మదినాన్ని వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ నెక్కొండలోని మిషన్ కాకతీయ చెరువు గట్టున జరుపుకోగా, వి.ప్రకాష్ తన 62వ జన్మదినాన్ని రాజేంద్రసింగ్ ఆశ్రమంలో జరుపుకోవడం విశేషం.
 57. దేశీయ ఔషధ పరిశ్రమ ఎగుమతుల్లో దాదాపు మూడో వంతు ఎగుమతులు అమెరికాకే జరుగుతాయి. అమెరికా మార్కెట్‌ భారత ఔషధ కంపెనీలకు కీలకం. ఆయా ఔషధ కంపెనీలు అమెరికా మార్కెట్‌లో కొత్తగా జనరిక్‌ ఔషధాలను ప్రవేశపెట్టడానికి చేసుకునే దరఖాస్తులు (అబ్రివియేటెడ్‌ న్యూ డ్రగ్‌ అప్లికేషన్‌-ఏఎన్‌డీఏ), ఏఎన్‌డీఏలకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) ఇచ్చిన అనుమతులు, పరిశోధన, అభివద్ధిపై ఔషధ కంపెనీలు చేసే వ్యయం కంపెనీలు, పరిశ్రమ పనితీరును ప్రతిబింబిస్తాయి.
 58. ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్ష పదవి రేసులో భారత సంతతికి చెందిన పెప్సికో మాజీ సీఈవో ఇంద్రా నూయి తెరపైకి వచ్చారు. అగ్రరాజ్యం అమెరికా ప్రతిపాద నతో ఆమె ఆ పదవిని చేపట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షరాలిగా ఇంద్రా నూయిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ నామినేట్‌ చేసినట్టు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ వెల్లడించింది.
 59. చైనా మరో గ్రేట్ వాల్ నిర్మించింది. తన భూభాగాలపై బయట నుంచి దాడులు జరగకుండా నిరోధించటానికి చుట్టూ ప్రాకారం నిర్మించుకున్నది. ఈ దేశం తన న్యూక్లియర్ క్షిపణి వ్యవస్థను కాపాడుకోవడానికి అదే తరహాలో చర్యలు తీసుకుంది. అతి మందపాటి ఉక్కు గోడలు నిర్మించింది. న్యూక్లియర్ స్థావరాలకు కవచంలా భూగర్భంలో గోడ కట్టారు. హైపర్ సోనిక్ క్షిపణులు, బంకర్ విధ్వంసక ఆయుధాలు సైతం ఈ ఉక్కు కవచాన్ని చీల్చ లేవు. న్యూక్లియర్ క్షిపణి కేంద్ర రక్షణ వ్యవస్థలో ఇది చివరి వరుస నిర్మాణం అవుతుందన్నారు. ఈ కేంద్రానికి భూగర్భంలోని మందపాటి కొండ గుహ తొలి రక్షణ వరుస అని, ఆ తర్వాతి వరుసలో వ్యూహాత్మక క్షిపణి నిరోధక విధ్వంసక వ్యవస్థలు, వైమానిక రక్షణ వ్యవస్థలు ఉంటాయని, ఇవన్ని విఫలం అయిన తర్వాతే ఈ ఉక్కు గోడ మీద రక్షణ భారం పడుతుంది.
 60. యూపీ వైద్య ఆరోగ్యశాఖ సరికొత్తగా 15 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 43 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల విధులకు హాజరైన డాక్టర్లు-రోగుల తో సెల్ఫీలు పంపిస్తేనే జీతం ఇస్తామని నిర్ణయించింది. వైద్యులు రోగుల తో సెల్ఫీ పంపించకపోతే వారి జీతం లో కోత విధించడంతో పాటు, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వైద్య శాఖ ఉన్నతాధికారులు హెచ్చరించారు. వాట్సప్ ద్వారా డాక్టర్లు రోజువారి అటెండెన్స్ ను రికార్డు చేయాలని వైద్య శాఖ అధికారులు ఆదేశించారు.
 61. విజయవాడ రమేష్ హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన (ఎన్ బిఈ ) సభ్యుడిగా నియమితులయ్యారు. గత మూడు దశాబ్దాలగా నగరంలో గుండె సంబంధిత వైద్య సేవలు అందిస్తున్న రమేస్ బాబును భారత ప్రభుత్వం ఎన్ బిఈ లో దక్షిణ భారతదేశంనుంచి ప్రతినిధిగా నియమించింది. ఈ నియమిక పత్రం ఎన్ బీఈ డైరెక్టర్ డాక్టర్ రష్మి కాంత్ దవే నుంచి రమేష్ బాబు అందుకున్నారు. ఈ నియామకం సంతోషంగా ఉందని డాక్టర్ రమేష్ బాబు తెలిపారు.
 62. ఐటీ పరిమితి ఐదు లక్షల రూపాయలకు పెంపు… మధ్యతరగతి ప్రజలకు ప్రధాని మోడీ మెగా రాయితీ! మధ్య తరగతి ప్రజలను, ఉద్యోగ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు మోడీ మరో భారీ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ వర్గాలకు ఆదాయపు పన్ను పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని యోచిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల దెబ్బతిన్న ఈ వర్గాలకు ఉపశమనం కలగచేస్తునే, ఎన్నికల్లో వారి నుంచి ప్రతికూలత రాకుండా తట్టుకోగలమని అభిప్రాయపడుతున్నారు. ఐటీ పరిమితి పెంపుతో పాటు మెడికల్ బిల్లు,ట్రాన్స పోర్టు అలవెన్సులు, విద్య ఫీజులు మొదలైనవి పన్ను మినహాయింపు జాబితాలో యదాతథంగా కొనసాగించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. తాత్కాలిక బడ్జెట్ లో భారీ వరాలను ప్రకటించడం ఔచిత్యం కాకపోయినప్పటికీ, ఎన్నికల సమయంలో బిజెపి ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదని ఉన్నతస్థాయి వర్గాలు అంటున్నాయి.
 63. నేడు జగన్ తో తెలంగాణ సీఎం చంద్రశేఖర రావు కుమారుడు కేటిర్ భేటీ.. తెలంగాణ సీఎం చంద్రశేఖర రావు కాంగ్రెస్, బిజెపియేతర ఫెడరల్ ఫ్రంట్ గురించి వైసీపీ తో చర్చించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఈ రోజు కె.తారక రామారావు( కెసిఆర్ కుమారుడు) ఇదే అంశంపై నేడు జగన్ తో స్వయంగా భేటీ కానున్నారు.ఈ పరిణమం పై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.ఒక వేళ కెసిఆర్ ఫ్రంట్ కు జగన్ మద్దతు ఇస్తే ఏం జరుగుతుంది? మద్దతు ఇవ్వకపోతే కెసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆంధ్ర ప్రదేశ్ లొ కెసిఆర్ పార్టీ పోటీచేస్తుందా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు .
 64. మొబైల్ యాప్ ద్వారా టాక్సీలను బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్న ఓలాలో ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ రు 150 కోట్ల, పెట్టుబడి పెట్టారు. బన్సల్ పెట్టుబడులకు గాను షేర్లను కేటాయించారు. ఈ, కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ లో వాల్మార్ట్ 77 శాతం వరకు వాటా తీసుకున్న తర్వాత ఫ్లిప్కార్ట్ నుంచి బన్సల్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బెంగళూరుకు చెందిన, ఓలా, అమెరికాకు చెందిన ఉబర్ తో భారత మార్కెట్లో పోటీ పడుతోంది. కార్యకలాపాల విస్తరణ కోసం 100 కోట్ల డాలర్లు సమీకరించాలి అన్నది ఓలా ప్రకటన.
 65. “దేశ ద్రోహం” చట్టాన్ని తొలగించాలని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. ఇది ఒక వలసవాద చట్టమని, కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ, వలసవాదుల చట్టం ఇవాల్టి రోజుల్లో ఎంత మాత్రం అవసరం లేదని అన్నారు. కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్ చేసిన వాళ్ల పై కూడా ‘దేశద్రోహం’ కేసులు బనాయిస్తున్నారని, చట్టాన్ని కేంద్రం దుర్వినియోగం చేస్తుందని పేర్కొన్నారు.
 66. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రైతుల రుణమాఫీకి ప్రభుత్వం భారీ పథకం సిద్ధం చేస్తుంది. జై కిసాన్ ముక్తి యోజన పేరుతో…రూ.50 వేల కోట్ల పంట రుణాన్నీ మాఫీ చేయ నుంది. బడ్జెట్ పరిమితులు లేకుండా అమలు చేయడానికి సీఎం కమల్ నాధ్ కసరత్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కమల్నాథ్ తొలి సంతకం రైతుల రుణమాఫీ పై చేసి, ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.
 67. కువైట్ ప్రభుత్వం కొత్త ఆంక్షలను అమల్లోకి తీసుకువచ్చింది. కువైట్ లో ఉంటున్న వలసదారులు ఇప్పటివరకు తమ కుటుంబ సభ్యులను విజిటింగ్ వీసా పై ఎటువంటి ఇబ్బందులు లేకుండానే కువైట్ కు తీసుకు వచ్చేవారు. అయితే ఇకపై తల్లిదండ్రులను, బంధువులను తీసుకురావడానికి కువైట్ ప్రభుత్వం కొన్ని ఆంక్షలు పెట్టింది.వలస దారుల నెలసరి ఆదాయం 500 దీనార్ లు లేదా అంతకు మించి వున్న వారి కుటుంబ సభ్యులే విజిటింగ్ వీసాపై కువైట్ కు రావాలంటూ నిబంధన లు పెట్టింది. ఒక కువైట్ దినార్ విలువ భారత కరెన్సీలో రు 233. అంటే 500దీనా ర్ లు దేశ కరెన్సీ లో 1,16000 రు, అన్నమాట.
 68. హాస్పిటాలిటీ సంస్థ ఓయో హోటల్స్ అండ్ రూమ్స్ భారీ లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం OYO వద్ద 4.6 లక్షల హోటల్ గదులు అందుబాటులో ఉన్నాయి. వీటి సంఖ్య పది లక్షలకు పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్లు OYO సీఈవో తెలిపారు. ఏడాది, ఏడాదిన్నర కాలంలో దీన్ని చేరుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ స్థాయికి చేరుకుని ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచే అవకాశం ఉంటుందని, ప్రస్తుతం OYO మూడవ స్థానంలో ఉందన్నారు. 2023 నాటికి 25 లక్షల గదులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ప్రమోటర్ రితేష్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం 13 వేలకు పైగా ప్రాంచైజీలు, లీజ్డ్ హోటల్లు, 4.50 లక్షలకు పైగా గదులు కంపెనీ వద్ద ఉన్నాయి.ప్రతి నెలకు 64వేలకు పైగా గదులను కంపెనీ జత చేసుకుంటుంది.
 69. తొలి విడతలో 769 మంది సర్పంచులు,10,654 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం… తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అవుతున్నాయి. మొదటి విడత ఎన్నికలకు గాను నోటిఫికేషన్ జారీ చేసిన గ్రామపంచాయతీల్లో 769 మంది సర్పంచులు, 10,654 మంది వార్డు సభ్యులు, ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినారు. రాష్ట్రంలోని మొత్తం గ్రామ పంచాయతీల్లో మొదటి విడతగా 4,479 పంచాయతీలకు, 39,822 వార్డు సభ్యుల పదవులకు జనవరి 7న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే,కాగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ ఉపసంహరణ అనంతరం, ఒకే ఒక్క నామినేషన్ దాఖలు అయినా పదవులన్నింటినీ ఏకగ్రీవమైనట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం పేర్కొంది. ఏకగ్రీవం, నామినేషన్ దాఖలు కానివి మినహా 3,701 సర్పంచ్ పదవుల కోసం, 12,202 మంది వార్డు సభ్యుల పదవులకు ఈనెల 21న ఎన్నికలు నిర్వహించనున్న ది. సర్పంచ్ పదవుల కోసం 12,202 మంది అభ్యర్థులు, వార్డు సభ్యుల పదవులకోసం 70,094 మంది పోటీపడుతున్నారు.

Agriculture

అన్నదాతలకు తీపి కబురు…

Published

on

జులై 11  2020,  VSB NEWS:

అన్నదాతను ఆదుకోవాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా గతేడాది ఫిబ్రవరి నెలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ను ఆవిష్కరించింది. రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో మోదీ సర్కార్ ఈ స్కీమ్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసింది.

ఈ పథకం కింద కేంద్రం అర్హులైన రైతులకు ఏడాదికి 3 విడతల్లో రూ.2 వేల చొప్పున రూ.6,000 అందిస్తోంది.

పీఎం కిసాన్ స్కీమ్‌ ఆరో విడత నిధులు త్వరలోనే రైతులకు అందనున్నాయి. ఆగస్ట్ 1 నుంచి అన్నదాతలకు రూ.2,000 డబ్బులు రైతు ఖాతాలో జమకానున్నాయి.

ఇకపోతే ఇప్పటికీ కూడా పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరని వారు ఉంటే సులభంగానే ఇంట్లో నుంచే ఈ పథకంలో చేరొచ్చు.

దీని కోసం మీ వద్ద మీ పొలం వివరాలు, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ సమాచారం ఉంటే సరిపోతుంది. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి మీరే పథకంలో చేరొచ్చు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 10 కోట్లకు పైగా రైతులకు లబ్ధి చేకూరుతున్నట్లుగా తెలుస్తోంది.

Continue Reading

ACCIDENT

రుద్రవరం పాఠశాలలో విషాదం

Published

on

ఆంధ్రప్రదేశ్,  కర్నూల్ జిల్లా,  జులై 11, 2020,  VSB NEWS: రుద్రవరం పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. లెట్రిన్ గుంతలో పడి ఏడేళ్ల నాగ విష్ణు మృతి చెందాడు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్లు నిర్మించేందుకు గుంతలు తవ్వి వదిలివేశారు. పాఠశాల ఆవరణలో ఆడుకుంటూ నాగ విష్ణు ప్రమాదవశాత్తు గుంతలో పడ్డాడు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాదంటూ తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

Continue Reading

FAST NEWS

ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌లు బదిలీ….

Published

on