భయానకం కంటిన్యూ

గతానికి భిన్నంగా కొత్త తరహా హింసను ఎంచుకున్నారు ఉగ్రవాదులు. కశ్మీర్ వ్యాలీలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు.. ప్రజల మధ్య అంతరాల్ని పెంచేందుకు వారు చేస్తున్న దారుణాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. తమ దారిన తాము బతికే వారిని గుర్తించి మరీ చేంపేస్తున్న వైనం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీస్తోంది. ఇటీవల కాలంలో కశ్మీర్ లోని కశ్మీరీ పండిట్లను దారుణంగా చంపేస్తున్నారు ఉగ్రవాదులు. తాజాగా ఆ జాబితాలోకి నాన్ లోకల్స్ ను మీద గురిపెట్టి వారి బతుకుల్ని ఆగమాగం చేస్తున్నారు.

అమాయకుల్ని హత్యలు చేయటం ద్వారా.. సాధారణ ప్రజల్లో భయాందోళనలు పెంచేలా చేయటమే కాదు.. ప్రజల మధ్య అంతరాల్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా.. స్థానికేతురుల పేరుతో ఇద్దరు అమాయకుల్ని కాల్చి చంపేసిన వైనం సంచలనంగా మారింది.  శనివారం శ్రీనగర్ లోని ఒక పానీపూరి వ్యాపారిని.. పుల్వామాలో ఒక కార్పెంటర్ ను అతి దగ్గరగా వెళ్లిన ఉగ్రవాదులు వారిని దారుణంగా కాల్చి చంపేశారు.

చనిపోయిన వారిలో ఒకరు బిహార్ కు చెందిన 30 ఏళ్ల అర్వింద్ కుమార్ షా ఒకరైతే.. మరొకరు ఉత్తరప్రదేశ్ కు చెందిన సాఘిర్ అహ్మద్ గా గుర్తించారు. తాజా హత్యలతో గడిచిన రెండు వారాల్లో మొత్తం తొమ్మిది మంది సామాన్యుల్ని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవటం గమనార్హం. మరోవైపు అధికారులు నిర్వహిస్తున్న ఎన్ కౌంటర్లలో వారు సైతం వరణిస్తున్నారు. అయితే.. ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు మట్టుబెడుతున్నా.. వారు మాత్రం తమ హింసను ఆపటం లేదు. సామాన్యుల్ని టార్గెట్ చేసి చంపేస్తున్న వైనం ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకాలం పండిట్ల మీద ఎక్కు పెట్టిన విల్లు.. ఇప్పుడు లోకల్.. నాన్ లోకల్ అంటూ డివిజన్ తెచ్చి మరీ చంపేస్తున్న వైనం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.

Leave a Comment

Your email address will not be published.

Start typing and press Enter to search